భారత విమానాలపై మరోసారి నిషేధాన్ని పొడిగించిన కెనడా
భారత్ నుంచి ఆగస్టు 21 వరకూ వాణిజ్య విమానాలను అనుమతించబోమని కెనడా ప్రకటించింది. వాస్తవానికి ఈ నిషేధం జులై 21 వరకే ఉంది. దీంతో తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డెల్టా వేరియంట్ కేసుల కారణంగానే ఈ నిషేధాన్ని పొడిగించారు. అయితే నేరుగా విమానాలు అనుమతించకపోయినా వేరే రూట్ల ద్వారా కెనడాలోకి భారతీయులు ప్రవేశించటానికి అనుమతిస్తారు. అయితే బయలుదేరటానికి ముందే కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారికే ఈ అనుమతి మంజూరు చేస్తారు. అత్యవసరం కాని ప్రయాణాలను నిలిపివేసేందుకు కూడా ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.
అయితే భారత్ లో తీసుకునే నివేదికలను కెనడా ఆమోదించటం లేదు. ఏ దేశంలో చివరగా విమానం ఎక్కుతారో అక్కడి నివేదికను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏప్రిల్ 22 నుంచి కెనడా భారత్ నుంచి విమానాలను అనుమతించటం లేదు. కొద్ది రోజుల క్రితమే భారత ప్రభుత్వం ఢిల్లీ నుంచి విమానాలపై నిషేధాన్ని తొలగించాల్సిందిగా కెనడాను కోరింది. అయితే నిషేధాన్ని మాత్రం అలా పొడిగించుకుంటూ పోతున్నారు.