108 విమానాశ్రయాలు...18843 విమానాలు

108 విమానాశ్రయాలు...18843 విమానాలు

దేశంలోని 108 విమానాశ్రయాల నుంచి వారంలో 18843 విమానాలు నడిపేందుకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి మంజూరు చేసింది. వేసవి కాలం షెడ్యూల్ లో భాగంగా ఈ సంఖ్యను ఖరారు చేశారు. కోవిడ్ కారణంగా విమానయానానికి సంబంధించి పలు పరిమితులు విధించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ షెడ్యూల్ ను ఖరారు చేశారు. 2021 అక్టోబర్ నెల చివరి ఆదివారం వరకూ ఈ షెడ్యూల్ అమల్లో ఉండనుంది. కోవిడ్ కు ముందు ఉన్న సంఖ్యలో 80 శాతం మేర మాత్రమే ఇప్పుడు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఈ విమానాశ్రయాల నుంచి వారంలో 18843 విమానాలు బయలుదేరుతాయి. ఈ షెడ్యూల్డ్ ఎయిర్ లైన్స్ జాబితాలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏపీలోని కర్నూలు విమానాశ్రయంతోపాటు బరైలీ, బిలాసపూర్ , రూపసి విమానాశ్రయాలు కూడా ఉన్నాయి.

ఏ ఎయిర్ లైన్స్ లో ఎన్ని విమానాలకు అనుమతి ఇచ్చింది కూడా డీజీసీఏ తన ట్వీట్ లో వెల్లడించింది. ఇండిగో ఏకంగా 8749 విమానాలను నడపనుండగా, గో ఎయిర్ 1747, స్పైస్ జెట్ 2854, ఎయిర్ ఇండియా 1683, విస్తారా 1288, ఎయిర్ ఏసియా ఇండియా 1243 విమానాలను నడపనుంది. కరోనా కారణంగా నెలలు పాటు ఆగిపోయిన విమానాలు గత ఏడాది మే 25న తిరిగి సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై అయితే నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంపిక చేసిన రూట్లలో మాత్రం ప్రస్తుతం విమానాలు నడుస్తున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it