విమానాలు తగ్గాయ్...ఛార్జీలు పెరిగాయ్
దేశీయ విమానయానం భారం అయింది. అది కూడా నేటి నుంచే. అదే సమయంలో గతంలో లాగా కోరుకున్నప్పుడు విమాన సర్వీసులు అందుబాటులో ఉండవు. అవి ఉన్నప్పుడే ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలి. జన్ ఒకటి నుంచి కొత్త ఛార్జీల్లో అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో విమాన సర్వీసులు కూడా 50 శాతానికి పరిమితం అయ్యాయి. కరోనా రెండవ దశ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయటంతో పాలు పలు నిబంధనలు పెట్టడంతో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో విమాన సర్వీసులను కరోనా ముందు నాటికి ఉన్న దాంట్లో 50 శాతం మాత్రమే అనుమతిస్తున్నారు. అదే సమయంలో జూన్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ కరోనా కాలంలో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. అయితే ఏడాదిన్నర కాలంగా వియానయాన రంగం కూడా తీవ్ర సమస్యల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దేశీయ విమాన సర్వీసుల్లో 40 నిమిషాల ప్రయాణం ఉన్న రూట్లలో ఛార్జీలను కనిష్టంగా 2600 రూపాయలు గరిష్టంగా 7800 రూపాయలు నిర్ణయించారు.40 నుంచి 60 నిమిషాల మధ్యదూరం ఉండే రూట్లలో ఛార్జీలను 3300-9800 రూపాయలుగా ఖరారు చేశారు.
60 నుంచి 90 నిమిషాల వ్యవధి ఉండే రూట్లలో ధరలు 4000-11700 రూపాయలు, 120 నుంచి 150 నిమిషాల 4700-13000, 150 నుంచి 180 నిమిషాల మధ్య రూట్లలో6100-16900 రూపాయలుగా నిర్ణయించారు. గత మూడు నెలలుగా దేశీయ విమానప్రయాణికుల్లో తగ్గుదల భారీగా ఉంది. అయితే ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు విమానయాన సంస్థలు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వీటిని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. విమాన ఇంథనం అయిన ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ ధరలు పెరగటంతో ప్రభుత్వం ఛార్జీల పెంపునకు నిర్ణయం తీసుకుంది. స్వల్ప నిడివి కల ప్రయాణాల్లో ఛార్జీలను 13 శాతం మేర పెంచారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతుండటంతో త్వరలోనే సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.