ప్రపంచంలోనే బిజీ విమానాశ్రయంగా దుబాయ్
దుబాయ్. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక దేశాల్లో అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఏటా ఇక్కడకు కోట్లాది మంది పర్యాటకులు వస్తారు. అయితే కరోనా కారణంగా ఇప్పుడు ఆ జోష్ తగ్గింది. అయితే తొలి దశ అనంతరం పర్యాటకులకు స్వాగతం పలికిన అంతర్జాతీయ కేంద్రాల్లో దుబాయ్ ముందు వరసలో నిలుస్తుంది. పలు జాగ్రత్తలు తీసుకుంటూ పర్యాటకులను అనుమతించింది. కరోనా సమంయలోనూ దుబాయ్ విమానాశ్రయం తన సత్తా చాటినట్లు ఓ నివేదిక వెల్లడించింది. మే నెలలో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్ నిలిచింది. అంతర్జాతీయ ప్రయాణికులకు దారులు మూసేసినా కూడా మేలో 189,5866 షెడ్యూల్డ్ సీట్ల ద్వారా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలిచిందని తేల్చారు.
దుబాయ్ తర్వాత 13 లక్షల సీట్లతో ఇస్తాంబుల్ లోని అటాటర్క్ విమానాశ్రయం నిలవగా..12 లక్షలపైన సీట్లతో దోహ అంతర్జాతీయ విమానాశ్రయం మూడవ స్థానంలో ఉంది. 2019 మేలో అంతర్జాతీయంగా అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో మొదటి స్థానంలో లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నిలిచింది. 747420 సీట్లతో ఇప్పుడు అది ఏడవ స్థానానికి పరిమితం అయింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమానాశ్రయాలు..విమానయాన సంస్థల వ్యాపారాలు దారుణంగా నష్టపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నందున త్వరలోనే పరిస్థితి చక్కపడొచ్చని భావిస్తున్నారు.