హైదరాబాద్ విమానాశ్రయానికి ప్రతిష్టాత్మక అవార్డు
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం స్కైట్రాక్స్ ప్రపంచ ఎయిర్ పోర్ట్స్ అవార్డులు-2021లో 'బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్ ఇన్ ఇండియా & సెంట్రల్ ఏషియా' అవార్డును గెల్చుకుంది. హైదరాబాద్ విమానాశ్రయం స్కైట్రాక్స్ అవార్డును గెల్చుకోవడం వరుసగా ఇది మూడవసారి. అలాగే ప్రపంచ టాప్ 100 విమానాశ్రయాలలో గత ఏడాది 71వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 64వ స్థానానికి చేరింది. హైదరాబాద్ విమానాశ్రయం పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. వాటిలో భారతదేశం, సెంట్రల్ ఏషియాలో అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయం విభాగం కింద 3వ ర్యాంకు, భారతదేశం, సెంట్రల్ ఏషియాలో బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ - 4వ ర్యాంకు, ఏషియాలో బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్ -ఆరవ ర్యాంకు దక్కించుకున్నట్లు జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. స్కైట్రాక్స్ కొన్ని నెలల క్రితం చాలా విస్తృతంగా ఆన్‌లైన్ ద్వారా చేపట్టిన ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సంతృప్తి సర్వేను సమీక్షించిన తర్వాత ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రపంచ ఎయిర్‌పోర్టులలో నాణ్యతకు స్కైట్రాక్స్ అవార్డులను గీటురాయిగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 550కి పైగా విమానాశ్రయాలలో కస్టమర్ సేవలను, సౌకర్యాలను పరిశీలించిన అనంతరం వీటిని విడుదల చేస్తారు.
ఈ ఫలితాలపై జీహెచ్‌ఐఎఎల్ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ ''ఈ మహమ్మారి సమయంలో అచంచలమైన నిబద్ధతతో పని చేసిన హైదరాబాద్ విమానాశ్రయ సిబ్బంది, వాటాదారులు, భాగస్వాములందరికీ ఈ అవార్డు అంకితం. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే మా వినూత్న, సాంకేతిక పరిష్కారాలు ఈ విజయానికి దోహదమయ్యాయని భావిస్తున్నాం. ప్రయాణీకులందరికీ మరింత సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు, మా నిబద్ధతను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ గుర్తింపు ప్రేరేపిస్తుంది.'' అన్నారు. జీఎంఆర్ నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డులలో మరొక ప్రధాన విజేతగా నిలిచింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులు 2021లో వరుసగా మూడో ఏడాది ఢిల్లీ విమానాశ్రయం 'బెస్ట్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా' ఎంపికైంది. 2020లో 50వ స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం 2021లో 45వ స్థానానికి చేరుకుని ప్రపంచంలోని టాప్-50 ఎయిర్‌పోర్టులలో చేరింది.