గోవాలో ఆగస్టు 9 వరకూ లాక్ డౌన్
కరోనా కేసులు తగ్గిపోయాయి..అలా సరదాగా కొన్ని రోజులు గోవా ట్రిప్ వేద్దామనుకుంటున్నారా?. దీనికి ఇంకా కొన్ని రోజులు వేచిచూడాల్సిందే. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం పర్యాటకులకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అంతే కాదు.. గోవా మరోసారి లాక్ డౌన్ పొడిగించింది. వాస్తవానికి ఆగస్టు 2తో ఇది ముగియాల్సి ఉంది. తాజాగా ఆగస్టు 9 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గోవాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గినా థర్డ్ వేవ్ ప్రారంభం అయిందనే అంచనాల మధ్య ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. తొలి దశలో కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత గోవా పర్యాటకులను అనుమతించింది. ఆ తర్వాత కొద్ది నెలలకే రెండవ దశ ఆ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. తీవ్ర ఇబ్బందుల పాలైంది.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే గోవా ప్రభుత్వం హోటల్స్ తెరించేందుకు అనుమతి ఇచ్చింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న బిజినెస్ ట్రావెలర్స్ ను ఎలాంటి నెగిటివ్ రిపోర్ట్ లేకుండా అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా కూడా హోటల్స్ లో ఆక్యుపెన్సీ లేకుండా పోయింది. కేసులు పూర్తిగా తగ్గి...పర్యాటకులకు సానుకూల సందేశాలు వెళితే తప్ప పర్యాటక రంగం ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేదని అంటున్నారు. గోవాలో కొత్తగా 59 కేసులు నమోదు అయ్యాయి.