గోవాలో మే 23 వరకూ కర్ఫ్యూ అమలు
దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన గోవాలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. మే 23 వరకూ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. అదే సమయంలో గోవాకు వచ్చే ఇతర రాష్ట్రాల వారు విధిగా కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ తోనే రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లేకపోతే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో పెళ్ళిళ్ళు, సమూహలు గుమిగూడటం వంటి ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు.
ఫార్మసీస్, మెడికల్ సౌకర్యాలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రం ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకూ తెరిచే ఉంటాయని తెలిపారు. మే23 వరకూ మాత్రం కర్ప్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. గోవాలో పాజిటివిటి రేటుతోపాటు మరణాల రేటు కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు.