కొత్త ఏడాదిలో ఐటా ట్రావెల్ పాస్

కొత్త ఏడాదిలో ఐటా ట్రావెల్ పాస్

కరోనా సంక్షోభం ముగింపు దశకు వచ్చిందనే అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు సరిహద్దులను తెరుస్తున్నాయి. వరస పెట్టి దశల వారీగా అంతర్జాతీయ ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నాయి. దుబాయ్, మాల్దీవులు, ఒమన్, థాయ్ లాండ్ వంటి దేశాలు అయితే కొన్ని పరిమితులతో పర్యాటకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మరికొన్ని దేశాలు అయితే తొలి దశ కింద వ్యాపార ప్రయాణికులకు అనుమతులు ఇస్తున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ విమాన రవాణా సమాఖ్య (ఐటా) ట్రావెల్ పాస్ తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. 2021 తొలి త్రైమాసికలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ డిజిటల్ ఈ హెల్త్ పాస్ ద్వారా అంతర్జాతీయ విమాన ప్రయాణికులు అత్యంత సులభంగా తాము ఎంచుకున్న మార్గాల్లో ప్రయాణించే వెసులుబాటు లభించనుందని చెబుతోంది. అంతే కాదు ఈ పాస్ వల్ల అంతర్జాతీయ విమాన రవాణా కూడా పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది.

ట్రావెల్ పాస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందించే కీలక ఎయిర్ లైన్స్, ఆయా దేశాల్లో ఉన్న కోవిడ్ 19 నిబంధనలు, టెస్టింగ్ లు, వ్యాక్సిన్ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేయనున్నారు. ప్రయాణానికి ముందు ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది ఆయా ఎయిర్ లైన్స్ నిబంధనలు, ప్రయాణించే దేశంలో అమల్లో ఉన్న నిబంధనలతోపాటు వ్యాక్సిన్, ల్యాబరేటరీల వివరాలు కూడా ఆ పాస్ ద్వారా పొందవచ్చు. ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ పాస్ తీసుకొస్తున్నట్లు ఐటా వెల్లడించింది. ఐటా ట్రావెల్ పాస్ ప్రధాన ఉద్దేశం ప్రయాణికులకు సులభమైన, అత్యుత్తమ రవాణా మార్గాన్ని చూపటమే అని వెల్లడించారు. సరిహద్దులను సురక్షితంగా ఓపెన్ చేయటానికి ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ మార్గం టెస్టింగ్ ఒక్కటే అని ఐటా డైరక్టర్ జనరల్, సీఈవో అలెంగ్జాండ్రీ డీ జునాయిక్ వెల్లడించారు.

Similar Posts

Recent Posts

International

Share it