భారత పర్యాటకులపై పలు దేశాల గురి

భారత పర్యాటకులపై పలు దేశాల గురి

భారత పర్యాటకులపై పలు దేశాలు వల విసురుతున్నాయి. ఒక వైపు పర్యాటకులకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరే నిర్ణయాలు తీసుకోవటం ద్వారా తాము కూడా భారీగా లబ్ది పొందేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. కొద్ది నెలల వ్యవధిలోనే మూడు కీలక దేశాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం విశేషం. కరోనా తర్వాత తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థలను గాడిన పెట్టుకుందుకు..ఈ రంగంపై ఆధారపడిన దేశాలు ఈ విషయంపై ఫోకస్ పెంచాయి 2023 సంవత్సరంలో భారతీయ పర్యాటకులకు పలు దేశాలు శుభవార్తలు చెప్పాయి. ఈ జాబితాలో ఇప్పుడు మలేషియా కూడా చేరింది. అది ఎలాగంటే 2023 డిసెంబర్ ఫస్ట్ నుంచి మలేషియా వెళ్లాలనుకునే వారు ఎలాంటి వీసా అవసరం లేకుండా ఆ దేశం వెళ్లొచ్చు. ఇండియా తో పాటు చైనాకు కూడా ఈ వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం భారతీయ పర్యాటకులు మలేషియా వెళ్లాలంటే టూరిస్ట్ ఈ వీసా కోసం దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయల వరకూ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. వీసా లేకుండా భారత పర్యాటకులకు ఆ దేశంలో పర్యటించే అవకాశం కల్పించటంతో ఈ మొత్తం వాళ్లకు ఆదా కానుంది.

వీసా లేకుండా ఆ దేశం లో ముప్పై రోజుల పాటు ఉండటానికి అనుమతి ఇస్తారు. అయితే భద్రత తనిఖీలు మాత్రం అందరికి ఒకే రకంగా ఉంటాయి. మలేషియా కు ఇండియా, చైనాలు అతి పెద్ద మార్కెట్. ఈ దేశాల నుంచి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకట్టుకునేందుకే ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే శ్రీ లంక తో పాటు థాయిలాండ్ కూడా భారత పర్యాటకులు కోసం వీసా లేకుండా తమ తమ దేశాల్లో పర్యటించే వెసులుబాటు కలిపిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వియత్నాం కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మలేషియా ఈ జాబితాలో చేరిపోయింది. పలు కీలక దేశాలు వీసా లేకుండా పర్యటించే అవకాశం కల్పిస్తుండటంతో ప్రయాణికులకు డబ్బు ఆదా కావటంతో పాటు ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేకుండా పోతుంది. కేవలం టికెట్ కొనుగోలు చేసి ఆయా దేశాలను చుట్టేసి రావొచ్చు.

Similar Posts

Recent Posts

International

Share it