హైదరాబాద్-మాల్దీవుల విమాన సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్-మాల్దీవుల విమాన సర్వీసులు ప్రారంభం

పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఇది ఓ శుభవార్త. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతాల్లో మాల్దీవులు ఇటీవల కాలంలో మరింత ముందు వరసలోకి వచ్చింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలోనూ సెలబ్రిటీలు అందరూ 'మాల్దీవుల' బాటే పట్టారు. అలాంటి మాల్దీవులకు ఇప్పుడు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ ఐఏల్) నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. గురువారం నాడే హైదరాబాద్ నుండి మాల్దీవులలోని మాలేకు గో ఎయిర్ విమాన సర్వీసును ప్రారంభించింది. గోఎయిర్ విమానం 11.40 గంటలకు హైదరాబాద్ నుండి మాలేకు బయలుదేరింది. గో ఎయిర్ ఈ విమానం ద్వారా అంతర్జాతీయ సర్వీసులకు ఈ-బోర్డింగ్‌ను ఉపయోగించుకోవడం ప్రారంభించింది. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, గో ఎయిర్ అధికారులతో పాటు, ఇతర విమానాశ్రయ భాగస్వాములు టెర్మినల్ వద్ద ప్రయాణీకులు, సిబ్బందికి వీడ్కోలు పలికారు.

గో ఎయిర్ ఫ్లైట్ G8 1533 ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు మాల్దీవులలోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో G8 4033 సర్వీసు మధ్యాహ్నం 2.30 గంటలకు మాలే నుండి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మాలే మధ్య సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం - వారానికి నాలుగు సార్లు విమానాలు నడుస్తాయి. వాటర్ స్పోర్ట్స్ ప్రియులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రేమికులు, హనీమూన్‌కు వెళ్లే జంటలకు మాల్దీవులు అత్యంత ఇష్టపడే ప్రదేశం. ఈ గందరగోళపు ప్రపంచం నుంచి తప్పించుకొనేందుకు ఈ భూతల స్వర్గం చాలా అనువైన టూరిస్టు కేంద్రం. మాలేలోని కృత్రిమ బీచ్‌లో కయాకింగ్, వేక్‌బోర్డింగ్, స్కూబా డైవింగ్, కాటమరాన్ సెయిలింగ్ వంటి ఆకర్షణీయమైన జల క్రీడా కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

Similar Posts

Recent Posts

International

Share it