యూపీలో ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయం
దేశ విమానయాన రంగంలో ఓ కీలక ముందడుగు. ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయం ఉత్తరప్రదేశ్ లోని జేవార్ లో ఏర్పాటు కానుంది. ఈ ప్రతిష్టాత్మక నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ (ఎన్ఐఏ) పనులకు ప్రధాని నరేంద్రమోడీ గురువారం నాడు శంకుస్థాపన చేశారు. తొలి దశలో 10,050 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ విమానాశ్రయం 2024 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతోపాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు పలువురు హాజరయ్యారు. విమానాశ్రయ నిర్మాణం 3250 ఎకరాల్లో జరగనుంది. ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయితే, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది. దీంతో దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు విమానాశ్రయాలను కలిగి ఉన్న తొలి నగరంగా ఢిల్లీ అవతరించనుంది.
వీటిలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలలో ఈ విమానాశ్రయం ఒకటి. ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఈ విమానాశ్రయాన్ని డెవలప్ చేయనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్ పోర్టు రైతులకు ఎంతో మేలు చేయనుందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను ఈ విమానాశ్రయం ద్వారా ఎగుమతి చేయవచ్చన్నారు. ఈ విమానాశ్రయ కల సాకారం అయ్యేందుకు సహకరించిన ఏడు వేల మంది రైతులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దన్యవాదాలు తెలిపారు.