స్పైస్ జెట్ కొత్త ఆఫర్..1122 రూపాయలకే విమాన టిక్కెట్లు
దేశంలోని ప్రముఖ చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. 2022కు స్వాగతం అంటూ వావ్ వింటర్ సేల్ ను ప్రకటించింది. దీని కింద దేశీయ విమాన రూట్లలో ఒక్కో టిక్కెట్ ను 1122 రూపాయలకే అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ టిక్కెట్ల బుకింగ్ డిసెంబర్ 27న ప్రారంభం అయి..డిసెంబర్ 31న ముగియనుంది. ఈ సమయంలో..ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లపై వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 15న మధ్య ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది.
దేశీయంగా విమానయాన రంగం కోవిడ్ పూర్వస్థితికి చేరుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కాస్త ఈ రంగాన్ని మళ్ళీ సమస్యల్లోకి నెడుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఈ ప్రభావం బాగా పడింది. సహజంగా అయితే సంవత్సరాంతం, క్రిస్మస్ సీజన్ లో ఫుల్ జోష్ ఉంటుంది. కానీ అత్యవసరం అయితే తప్ప చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.