ఈ ఏడాది హాలిడే టూర్లులేనట్లే!
పర్యాటకులకు చేదు అనుభవం మిగిల్చిన ఏడాది ఏదైనా ఉంది అంటే అది 2020 అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతే కాదు 2020 లో హాలిడే టూర్లు ఇక మర్చిపోవటమే అంటున్నారు ట్రావెల్ ఏజెంట్స్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సహజంగా ప్రతి ఏటా వేసవిలోలోనే పర్యాటకుల టూర్లు పెద్ద ఎత్తున ఉంటాయి. చాలా మంది చల్లటి ప్రదేశాలకు వెళ్ళి సేదతీరుతారు. మరికొంత మంది మాత్రం తమ బడ్జెట్ పరిమితులకు అనుగుణంగా ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకుంటారు. అది దేశీయ టూర్ కావొచ్చు..విదేశీ టూర్ కావొచ్చు. కానీ కరోనా కొట్టిన దెబ్బ దేశీయ పర్యాటక రంగంతోపాటు అంతర్జాతీయంగా కూడా పర్యాటక రంగంపై తీవ్రంగా పడింది. అసలు విమాన సర్వీసులు ఎప్పటికి ప్రారంభం అవుతాయో ఇంకా స్పష్టత రాని పరిస్థితులు. అంతే కాదు..ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎప్పటికి పూర్తిగా తొలగిపోతుందనే అంశంపై ఇప్పటివరకూ స్పష్టత లేదు.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా రాబోయే రోజుల్లోనూ పర్యాటక రంగానికి గడ్డుకాలమే అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. ముఖ్యంగా భారత్ నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు బ్యాంకాక్, దుబాయ్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, శ్రీలంక, మాల్దీవులు, బాలి వంటి ప్రదేశాలకు వెళ్తారు. కొంత మంది ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాలకు వెళ్ళినా కూడా ఎక్కువ మంది ప్రాధాన్యత మొదట ప్రస్తావించిన దేశాలకే ఉంటుంది. ఆయా దేశాల్లో కూడా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఉండటంతో పలు దేశాలు విమాన సర్వీసులను నిలిపివేయటంతో పర్యాటకులను అనుమతించటం లేదు. దీంతో ఈ ఏడాది అంతా పర్యాటక సీజన్ పోయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి.
ఒకటి ఈ ఏడాది విద్యా సంవత్సరంలో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. అదే సమయంలో ఉద్యోగులు కోల్పోవటం, లాక్ డౌన్ చిన్న వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారుల వరకూ నష్టాలు వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి కరోనా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే తప్ప ప్రజలు పర్యాటకంపై పెద్దగా ఫోకస్ పెట్టే అవకాశం లేదని చెబుతున్నారు. ప్రముఖ సంస్థ క్రిసిల్ అంచనా ప్రకారం వియానమాన రంగం కరోనా ముందు నాటి పరిస్థితులకు చేరుకోవాలంటే 18 నుంచి 24 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తోంది. ఈ లెక్కన 2020 సంవత్సరాల పర్యాటక ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేసిన ఏడాదిగా చరిత్రకు ఎక్కనుంది.