గో...గో...గోవా..ఆంక్షలు అన్నీ ఔట్
కోవిడ్ కు ముందులాగానే వెళ్ళొచ్చు..క్వారంటైన్ లేదు..సర్టిఫికెట్లు అవసరం లేదు
పర్యాటక సీజన్ దగ్గర కొస్తున్న సమయంలో గోవా ఆంక్షలు అన్నీ ఎత్తేసింది. రాష్ట్రంలోకి గతంలో లాగానే నేరుగా ఎవరైనా ఎంటర్ కావొచ్చు. ఇటీవల వరకూ నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారిని మాత్రమే అనుమతించారు. దీనికి తోడు క్వారంటైన్ నిబంధనలు ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని ఆంక్షలు ఎత్తేశారు. కేంద్రం అన్ లాక్ 4లో భాగంగా ప్రకటించిన నిర్ణయాల ప్రకారం రోడ్డు మార్గంతోపాటు ఏ మార్గం ద్వారా వచ్చినా రాష్ట్రంలో ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలనే నిబంధనను ఎత్తేశారు. అంతే కాదు..గోవాలో పబ్స్, బార్లకు కూడా గేట్లు తెరిచారు. సెప్టెంబర్ 1 నుంచే ఇవి ఓపెన్ కానున్నాయి. కాకపోతే పబ్స్, బార్లలో మాత్రం కోవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. గోవా దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న విషయం తెలిసిందే.
కొద్ది రోజుల క్రితమే పరిమిత సంఖ్యలో హోటల్స్ ఓపెన్ చేసి..పర్యాటకులకు అనుమతించారు. అయితే ముందుగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. సర్టిఫికెట్ లేకుండా వచ్చిన వారికి అక్కడ పరీక్షలు చేసి ఫలితం తేలిన తర్వాత వాళ్ళను బయట తిరిగేలా అనుమతించే వారు. ఇప్పుడు అన్ లాక్ 4లో భాగంగా ఆంక్షలు అన్నీ మాయం అయిపోయాయి.. సో..ఇప్పుడు గోవా అంటే..గతంలో మాదిరి విమానం, కారులో ఎంచక్కా బయలుదేరి పోవచ్చు. అయితే కరోనాకు మాత్రం ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాల్సిందే. గోవాకు గత కొన్ని రోజులుగా వచ్చే విమానాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.