ప్రతి ముగ్గురిలో ఒక పైలట్ లైసెన్స్ ఫేక్!
షాకింగ్ న్యూస్. అక్కడ ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరి లైసెన్స్ ఫేక్. వాళ్లు ఏ మాత్రం విమానాలు నడపటానికి అర్హులు కూడా కాదు. పాకిస్తాన్ లో ఉన్న పైలట్లలో ఏకంగా 30 శాతం మంది ఫేక్ లైసెన్స్ లు కలిగి ఉన్నట్లు ఆ దేశ పౌరవిమానయాన శాఖ మంత్రి గులామ్ సర్వర్ ఖాన్ వెల్లడించినట్లు ‘సీఎన్ఎన్’ కథనం వెల్లడించింది. పాకిస్తాన్ లోని 260 మంది పైలట్లు తమ బదులు డబ్బులు ఇచ్చి వేరే వారితో పరీక్షలు రాయించినట్లు గుర్తించారు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) ఫేక్ లైసెన్స్ లు ఉన్న అందరినీ తక్షణమే నిలిపివేసింది. పీఏఐతోపాటు దేశంలోని పలు ఎయిర్ లైన్స్ లో పనిచేసేందుకు 850 మందికిపైగా పైలట్లు ఉన్నారు. గత నెలలో కరాచీలో ఓ విమానం కూలి ఏకంగా వంద మంది మరణించిన సంఘటన అనంతరం జరిపిన విచారణలో ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ మాటను పెడచెవిన పెట్టి వ్యవహరించినట్లు విచారణలో తేల్చారు.