పెనుగంచిప్రోలు
పెనుగంచిప్రోలు గ్రామం పూర్వ పేరు పెదకంచి. తదనంతరం పెనుగంచిగా పెనుగంచిప్రోలుగా మారింది. పెనుగంచిప్రోలు అనే పేరు పెద్ద కంచీపురం నుండి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులోనున్న కంచి చిన్న కంచి అయితే, ఇది పెద్ద కంచి. ఈ ఊరిలో 108 దేవాలయాలు ఉండేవని చెబుతారు. అయితే కాలక్రమలో ఈ ఊరి పక్కనే ప్రవహిస్తున్న మునియేరు వరదల వల్ల ఆ ఊరు, ఆ దేవాలయాలు భూగర్భంలో కలిసి పోయాయి.
అందుకే ఇప్పటికీ ఆ ఏటికి వరద వచ్చినపుడు ఇసుక తిన్నెల మధ్యన పురాతన దేవాలయాల స్ధంభాలు నీటిలో కనిపిస్తాయి. కొన్ని బయటకు కూడా దర్శనమిస్తాయి. కానీ వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ ఊరిలో ఉన్న ఆదినారాయణస్వామి, గోపాలస్వామి విగ్రహాలు భూమిలో దొరికినవే. పెనుగ్రంచిపోలు సంస్థానానికి సంబంధించిన అనేక తవ్వకాలలో పలు శాసనాలు లభ్యమయ్యాయి. ఇక్కడ ఉన్న తిరుపతమ్మ తల్లి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ గ్రామంలో జరిగే శ్రీ తిరుపతమ్మ తల్లి గ్రామ దేవత తిరునాళ్ళకు చుట్టుపక్కల నుంచి ప్రజలు భారీ ఎత్తున వస్తారు.