పేరంటాలపల్లి

పేరంటాలపల్లి

పాపికొండల ప్రాంతంలో విహారయాత్ర స్థలంగా ప్రసిద్ధి చెందిన గ్రామం పేరంటాలపల్లి. ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఉన్నది. 2014 వరకూ ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ గ్రామం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైంది. ఈ గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించడం అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది.ఇక పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలు, గుడి వెనుక రాళ్లనుంచి పారే నీటి పరవళ్లు మదిని దోస్తాయి. పేరంటాలపల్లి విహారయాత్రలో రాష్ట్రంలోని రెండవ భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీసుందర సీతారాముల వారి దర్శనం కలుగుతుంది.

ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షి ప్రతిష్ఠించిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. ఆ దేవతామూర్తులను చూడగానే నిజంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వాములను మనం దర్శిస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎత్తయిన కొండల నుంచి వచ్చే పిల్లగాలులు మనస్సును పరవశింపచేస్తాయి. పక్కనే ఎతైన రెండు పర్వతాలు వాలి,సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి. పర్యాటకులు బోటు ప్రయాణం మధ్యలోనే ఇసుక తిన్నెలపైనే భోజనం చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

Similar Posts

Recent Posts

International

Share it