పీ పీ ఐల్యాండ్, పుకెట్
ఆ ప్రాంతం అంతా ‘ద్వీపాల వనం’ అని చెప్పుకోవచ్చు. ఒకటి కాదు..రెండు కాదు..ఎన్నో ద్వీపాలు. పుకెట్ లో అన్నింటి కంటే హైలెట్ అంటే పీ పీ ద్వీపం అని చెప్పుకోవచ్చు. థాయ్ ల్యాండ్ లోని పుకెట్ కు వెళ్ళారంటే ఖచ్చితంగా చూసి తీరాల్సిన ద్వీపాల్లో పీ పీ ఐల్యాండ్ ఒకటి. పర్యాటకులు పుకెట్ లో ఏ హోటల్ లో బస చేసినా అక్కడ నుంచే పీపీ ఐల్యాండ్ తోపాటు పలు ద్వీపాలకు టూర్లు ఏర్పాటు చేస్తారు. ఉదయం పుకెట్ నుంచి బయలుదేరి..సాయంత్రానికి అన్ని ద్వీపాలను చూసిన తర్వాత నిర్వాహకులు వెనక్కి తీసుకువస్తారు. పీ పీ ఐల్యాండ్ తో కూడిన ద్వీపాల సందర్శనకు స్పీడ్ బోట్ పై అయితే పెద్దలకు 2800 బాత్ లు, పిల్లలకు (మూడు నుంచి పది సంవత్సరాల లోపు) అయితే 1600 బాత్ లు వసూలు చేస్తారు. భారతీయ కరెన్సీ 2.27 రూపాయలకు ఒక థాయ్ ల్యాండ్ బాత్ వస్తుంది. అంటే పీపీ ఐల్యాండ్ టూర్ కు ఒక్కో పర్యాటకుడు సుమారు ఏడు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
పీపీ ల్యాండ్ కు వెళ్ళే సమయంలో సముద్రమార్గంలో స్పీడ్ బోట్ జర్నీనే పర్యాటకులకు ఓ వింత అనుభూతిని ఇస్తుంది. సముద్రం మధ్యలోనే డైవింగ్ మాస్క్ తో చేసే ఈత (స్కూర్కిలింగ్)కు అనుమతిస్తారు. బోట్ ను అక్కడే నిలిపివేసి..కొంత సేపు స్కూర్కిలింగ్ తర్వాత తిరిగి ద్వీపాలకు తీసుకెళతారు. పీ పీ ఐల్యాండ్ టూర్ లో మాయా బీచ్, కాయ్ ఐల్యాండ్, వైకింగ్ కేవ్, మంకీ బే వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. టూర్ ప్యాకేజీలో భాగంగా మధ్యలో భోజనంతోపాటు..సాయంత్రం స్నాక్స్ కూడా ప్యాకేజీలో భాగంగానే ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు నిజంగా పీ పీ ఐల్యాండ్ పర్యటన జీవితకాలంలో నిలిచిపోయే అనుభూతిని కలగచేస్తుందనటంలో సందేహం లేదు. బ్యాంకాక్, పట్టాయాలతో పోలిస్తే పుకెట్ పర్యటన ఖరీదైన వ్యవహారమే.
https://www.youtube.com/watch?v=xOf3FyJhTNI