దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16కి.మీ. దూరంలో ఉంది.  ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కడప నుంచి కర్నూలు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నానది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’అనీ, శైవులు దీనిని ‘మధ్య కైలాసం’ అనీ అంటారు. ఆంధ్రప్రదేశ్ లో  ఇదొక్కటే శంకరాచార్య మఠం.ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండేది. గరుత్మంతుడు ఇంద్రుని అమృతభాండాన్ని తీసుకుని వస్తుండగా..ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికీ పోరాటం జరిగింది. ఆ సమయంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయట. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి యవ్వనం లభించేదట.అమరత్వమూ సిద్ధించేదట. దేవతలు భయపడి శివుణ్ణి ఆశ్రయించారు. శివుడు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు.

వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలె తేలింది. అదే పుష్పగిరి అయిందని పురాణ కథనం. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి,వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రమంటారు. పుష్పగిరి శిల్ప కళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుర్రాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉంటాయి. భారత, రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించి కనిపిస్తాయి. కిరాతార్జున గాథ చిత్రీకరించి ఉంది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.

ఒంటిమిట్ట

Previous article

రంగనాథాలయం

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *