పది నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన ఆ విమాన టిక్కెట్లు

పది నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన ఆ విమాన టిక్కెట్లు

విమానంలో నుంచి అందమైన ప్రదేశాలను అతి దగ్గర నుంచి చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ ఈ అవకాశం ఎప్పుడూ రాదు. కరోనా కారణంగా ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ విమాన ప్రయాణికులకు ఓ వినూత్న ఆఫర్ తీసుకొచ్చింది. అదేంటి అంటే ఆ విమానం సిడ్నీలో బయలుదేరి ఓ ఏడు గంటల పాటు ఆస్ట్రేలియాలోని అత్యంత సుందరమైన ప్రదేశాలను అతి దగ్గరగా చూపించి తిరిగి మళ్ళీ సిడ్నీలో ల్యాండ్ అవుతుంది. క్వాంటాస్ కు చెందిన బోయింగ్ 787 విమానం ద్వారా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఫ్లైట్ టూ నో వేర్’ కింద సర్వీసు ప్రకటించిన పది నిమిషాల్లోనే టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. 134 సీట్లను అలా నిమిషాల్లో కొనుగోలు చేశారు. క్వాంటాస్ చరిత్రలోనే ఇంత వేగంగా టిక్కెట్లు అమ్ముడు అవటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఈ టిక్కెట్ల ధర భారతీయ కరెన్సీలో చూస్తే 42 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకూ ఉంది. ఇందులోనూ బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు.

కోవిడ్ కారణంగా ఇంకా పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతించటం లేదు. దీంతో చాలా మంది తమ పర్యటనల అనుభూతిని పొందలేకపోతున్నారు. ఈ ప్రత్యేక విమానం ఉలూరు, కాటా జుటా, గోల్డ్ కోస్ట్, బైరన్ బే, సిడ్నీ హార్బర్ వంటి ప్రదేశాలను ఈ విమానం కవర్ చేయనుంది. ప్రయాణ అనుభూతిని కోల్పోతున్న ప్రయాణికుల కోసమే సుందర ప్రదేశాలను కవర్ చేసేలా ఈ జర్నీని ప్లాన్ చేసినట్లు క్వాంటాస్ వెల్లడించింది.దీనికి పాస్ పోర్టు కూడా అవసరం లేదు..ఎలాంటి క్వారంటైన్ ఉండదు. ఈ ప్రత్యేక విమానం సిడ్నీ డొమెస్టిక్ విమానాశ్రయం నుంచి అక్టోబర్ 10న బయలుదేరి ఏడు గంటల పాటు చక్కర్లు కొట్టి మళ్ళీ వెనక్కి వస్తుంది. డిమాండ్ కు అనుగుణంగా ఇదే తరహా విమానాలను నడిపే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.

Similar Posts

Recent Posts

International

Share it