రామప్ప దేవాలయం
కాకతీయ రాజు గణపతిదేవుడి దగ్గర సైన్యాధిపతిగా ఉన్న రేచర్ల రుద్రదేవుడు క్రీ శ 1213లో రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలంపేట గ్రామంలో ఉంటుంది.ఈ ఆలయంలోని శిల్పకళా సంపదకు ప్రపంచంలోనే గొప్ప ప్రత్యేకత ఉంది. రామప్ప అనే శిల్పి చెక్కటంతోనే ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ కొలువై ఉండే ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణువు అవతారమైన రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఇది. కాకతీయుల ప్రత్యేక నిర్మాణ శైలిలో ఎత్తైన పీఠం నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఎంతో చరిత్ర గల ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది.సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మండపంలో ఎంత వెలుతురు ఉంటుందో..గర్భగుడిలోనూ అంతే వెలుగు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఎంతోపేరు గాంచిన రామప్ప దేవాలయం దేశ..విదేశాల నుంచి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఇక్కడి మహా మండపం వెలుపలి అంచున పై కప్పు కింద భాగాన నల్లని నునుపు రాతి పలకాలపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కిన మదనిక,నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు.ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం, కామేశ్వర,కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా?అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. మండపం పైకప్పు మీద శిల్పకళాసౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి.శివుడి వైపు చూస్తున్న నందిని చాలా అందంగా చెక్కారు. ఇప్పటికి ఈ నంది చెక్కుచెదరకుండా ఉంది.
సందర్శన వేళలు: ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 6.00గంటల వరకూ
(వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామప్పగుడి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. )
https://www.youtube.com/watch?v=z6KBuYwGkwA