నగరంలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాల్లో సాలార్ జంగ్ మ్యూజియం ఒకటి. హైదరాబాద్ రాజధానిగా పరిపాలించిన అసఫ్ జాహీల వైభవాన్ని ఈ మ్యూజియం చాటి చెబుతుంది. ఈ మ్యూజియం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దేశ, విదేశీ పర్యాటకుల మనసు దోచే అద్భుత కళాఖండాల సమూహం ఇందులో దర్శనం ఇస్తుంది. సాలార్ జంగ్ మ్యూజియం ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకుల మన్ననలు పొందుతోంది. నిజాం నవాబుల ప్రధాని మూడో సాలార్ జంగ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ కళలపై తనకున్న అభిరుచితో ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి అరుదైన కళాఖండాలను సేకరించాడు. ఆయన తాత, తండ్రి కూడా ప్రధాని పదవిలో ఉండి కొన్ని కళాఖండాలు సేకరించాడు. మూడవ సాలార్ జంగ్ ప్రధాని పదవి కంటే కళా సంపద సేకరణపైనే దృష్టి పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. ది బెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదు పొందిన ఆయన తన జీవిత కాలంలో ఏకంగా 48 వేల కళాఖండాలు సేకరించారు. సాలార్ జంగ్ నివాసం ఉన్న దివాన్ దేవిడిలోని ఐనఖానలో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1951 డిసెంబర్ 16న ఈ కళాఖండాల ప్రదర్శనను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 1962లో పార్లమెంట్‌లో చట్టం చేయటంతో సాలార్ జంగ్ మ్యూజియం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది.

అంతకు ముందు మూడవ సాలార్ జంగ్ మరణం తర్వాత ఈ కళాఖండాలను దక్కించుకునేందుకు ఆయన బంధువర్గం ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ కేంద్రం చట్టం చేసి వీటిని జాతి సంపదగా ప్రకటించింది. హైదరాబాద్ లోని నయాపూల్ దగ్గర దారుల్ షిఫాలో సాలార్ జంగ్ మ్యూజియం నిర్మించి ..అందులో ఈ కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. 1968 జూలై 14న ఈ మ్యూజియం రెడీ అయింది. అప్పటి నుంచి అందులో కళాఖండాలను ఉంచారు. ఈ మ్యూజియంలో ముట్టుకుంటే మాసిపోతాయనే రీతిలో అద్భుతమైన పాలరాతి విగ్రహాలు కనువిందు చేస్తాయి. ప్రతి గంటకు ఓ మనిషి వచ్చి గంటలు మోగించే గడియారం (మ్యూజికల్ క్లాక్) సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. సాలార్ జంగ్ మ్యూజియం అంతర్జాతీయ స్థాయి మ్యూజియం కావటంతో చైనా, జపాన్, ఇంగ్లాండ్, అల్బర్ట్స్ మ్యూజియాలు కూడా తమ కళాఖండాల ప్రదర్శనలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. ఈ మ్యూజియంకు విదేశీ సందర్శకులు పెద్ద ఎత్తున వస్తారు. ఈ మ్యూజియంలో మెఫిస్తోఫిలీస్, రెబెకా విగ్రహాలు ప్రసిద్ధమైనవి. దంతాలతో చేసిన వస్తువులు,ఆయుధాలు, పచ్చల, ఖురానుల సేకరణ కూడా ఉంటుంది.

సందర్శన సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

శుక్రవారం, పబ్లిక్ హాలిడేస్‌లో సెలవు

 

చార్మినార్

Previous article

కళింగపట్నం

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Hyderabad