శ్రీశైలం

శ్రీశైలం

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తుల నామస్మరణతో మారుమోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానానికి రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడం నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారాలు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది. అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది. దశ భాస్కర క్షేత్రాలలో శ్రీశైలం ఆరవది. శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది క్రీ.శ.6వ శతాబ్ది నాటిది.

ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. క్రీ.శ.6, 7 శాతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంథం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లున్న భక్తకవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం (శ్రీపర్వతం) అని పేర్కొన్నారు. పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో ‘కరమొప్పు దక్షిణ కైలాసము’ అంటూ శ్రీశైలాన్ని కీర్తించాడు. తెలుగు సాహిత్యంలో తొలి యాత్రా చరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్న పట్టణం నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన రాసిన దాని ప్రకారం 1830ల్లో ఈ ప్రాంతం కందనూరు నవాబు అధీనంలో ఉండేది. శ్రీశైలం కొండమీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడమూ, క్రూరమృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు, కందనూరు నవాబు తరఫున యాత్రికుల నుంచి ఆశీలు తీసుకునే ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు.

Similar Posts

Recent Posts

International

Share it