‘ఫేక్ ఫ్లైట్స్ కాన్సెప్ట్’ ఏంటో తెలుసా?

‘ఫేక్ ఫ్లైట్స్ కాన్సెప్ట్’ ఏంటో తెలుసా?

ఛాన్స్ ఉంటే చాలు దేశం వదిలిపెట్టి పోవాలి. అలా అలా సరదాగా విహరించి రావాలి. ఇది ఎంతో మందిలో ఉన్న కోరిక. మీ దగ్గర వందల కోట్ల రూపాయలు ఉన్నా ప్రస్తుతం ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రపంచంలో కీలక దేశాలు అన్నీ తమ సరిహద్దులను మూసివేశాయి. ఒక దేశం నుంచి మరో దేశం వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకో ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే నిత్యం తిరిగే వారు ఎన్ని రోజులు అని అలా ఇంట్లో కూర్చుని ఉంటారు. అసలే తిరిగే ప్రాణం. అలాంటి వారి కోసం తైవాన్ ‘ఫేక్ ఫ్లైట్స్’ కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఇదేంటి విచిత్రంగా.. ఫేక్ ఫ్లైట్స్ ఏంటి అంటారా? తైపీలోని సాంగ్సాన్ విమానాశ్రయం పర్యటనల కోసం ఎంతో ఆసక్తితో ఉన్న వారికి ఈ అనుభూతిని అందిస్తోంది. ఈ ఫేక్ ఫ్లైట్స్ లో ప్రయాణం కోసం ఓ ఫేక్ ప్రయాణ వివరాలతో కూడిన పత్రం అందజేస్తారు.

దీని ఆధారంగా ఆ విమానాశ్రయంలో పాస్ పోర్టు కంట్రోల్ రూమ్, సెక్యూరిటీల నుంచి వెళ్ళి విమానంలో కూర్చోవచ్చు. కాకపోతే అది మాత్రం ఎగరదు.తొలి రోజే అరవై మంది ప్రయాణికులు ఈ ఫేక్ ఫ్లైట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏకంగా 7000 మంది ఇందులో పాల్గొనటానికి తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. తాను నిజంగా దేశం వదిలి వెళ్ళటానికి ఆసక్తిగా ఉన్నానని..అయినా కరోనా మహమ్మారి కారణంగా అది సాధ్యం కావటం లేదని సో చున్ వీ అనే మహిళ తెలిపారు. ఇలా ఫేక్ ఫ్లైట్స్ లో భాగంగా వచ్చి విమానంలో కూర్చున్న వారితో విమాన సహాయ సిబ్బంది కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమం సందర్భంగా విమానాశ్రయ సిబ్బంది విమానాశ్రయంలో చేసిన మార్పులు, చేర్పులను ప్రయాణికులను చూపించారు.

Similar Posts

Recent Posts

International

Share it