తాజ్ మహల్..ఎర్రకోటలో సందర్శకులకు అనుమతి
జులై 6 నుంచి గ్రీన్ సిగ్నల్..కేంద్రం నిర్ణయం
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ సందర్శనకు మళ్ళీ రంగం సిద్ధం అయింది. కరోనా తో విధించిన లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు సందర్శకులను దూరంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు ఇక కళకళలాడబోతున్నాయి. ఎందుకంటే జులై 6 నుంచి తాజ్ మహల్ తోపాటు దేశంలోకి కీలక ప్రదేశాల్లో పర్యాటకులను అనుమతించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎర్రకోట, తాజ్ మహల్ తోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల గేట్లు తెరవబోతున్నారు. లాక్ డౌన్ ప్రకటన తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిధిలో ఉన్న 3400 ప్రతిష్టాత్మక ప్రాంతాల సందర్శనకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తాజాగా ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యలతో మధ్యప్రదేశ్ లోని సాంచీ, ఢిల్లీలోని పురానా ఖిల్లా, ఖజురహోలో జులై 6 నుంచి గేట్లు తెరుచుకోనున్నాయని పేర్కొన్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అన్ లాక్ లో భాగంగా కేంద్రం ఒక్కొక్క విభాగానికి మినహాయింపులు ఇచ్చుకుంటూ పోతోంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా...భారత్ లోనూ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే.