దివాళా అంచున థాయ్ ఎయిర్ వేస్!
థాయ్ ఎయిర్ వేస్. పర్యాటకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. థాయ్ ల్యాండ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ థాయ్ ఎయిర్ వేస్ ఇంటర్నేషనల్ (టీహెచ్ఏఐ) ప్రస్తుతం దివాళా అంచున ఉంది. ఏ క్షణంలో అయినా ఈ ఎయిర్ వేస్ దివాళా ప్రకటించే అవకాశం ఉంది. అయితే దివాళా ప్రకటించిన తర్వాత ఈ ఎయిర్ లైన్స్ ను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలా?. లేక ముందుగానే ఆర్ధిక కష్టాల నుంచి గట్టెక్కించాలా అన్న అంశంపై థాయ్ ల్యాండ్ సర్కారు తర్జనభర్జనలు పడుతోంది. కరోనా దెబ్బకు ఎక్కువగా పర్యాటక రంగంపై ఆధారపడిన ఆ దేశం ప్రస్తుతం నానా కష్టాలు పడుతోంది.
థాయ్ ఎయిర్ వేస్ స్టాక్ ఎక్స్చేంజ్ లకు ఇచ్చిన సమాచారం ప్రకారం 2017లో కంపెనీ నికర నష్టం 2.11 బిలియన్ బాత్(థాయ్ కరెన్సీ బాత్) లు ఉంటే, 2018కి అది కాస్తా 11.6 బిలియన్లకు, 2019లో 12 బిలియన్ బాత్ లకు చేరింది. త్వరలోనే సర్కారు ఈ ఎయిర్ లైన్స్ కు భారీ బెయిల్ ఔట్ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నాయి. అయితే దీనికి ఈ అధికారిక ఎయిర్ లైన్స్ దేశంలోని చట్టాల ప్రకారం అత్యంత సమర్ధవంతమైన పునరుద్ధరణ పథకాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.