దీర్ఘకాలిక టూరిస్ట్ వీసాలకు ధాయ్ ల్యాండ్ ఓకే
థాయ్ ల్యాండ్ ఇప్పట్లో పర్యాటకులను అనుమతించేలా లేదు. కాకపోతే మంగళవారం నాడు సమావేశం అయిన ఆ దేశ కేబినెట్ పర్యాటకులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే 14 రోజుల పాటు క్యారంటైన్ కు అంగీకరించి..కనీసం 90 రోజులు అక్కడ ఉండటానికి సిద్ధపడే వారికి దీర్ఘకాలిక వీసాలు ఇవ్వటానికి అంగీకరించింది. ఈ తొంభై రోజుల గడువు ను మరో 90 రోజుల పాటు పొడిగించుకోవటానికి కూడా అనుమతించనున్నారు. ఎక్కువ రోజులు ఇక్కడ ఉండదలచుకున్న వారికి దీర్ఘకాలిక వీసాలు ఇవ్వనున్నారు. పర్యాటకపరంగా వచ్చే వారికి, ఆరోగ్య సమస్యలపై వచ్చేవారికి ఈ వెసులుబాటు కల్పించనున్నారు. అయితే ఎవరైనా సరే 14 రోజుల పాటు క్వారంటైన్ మాత్రం తప్పనిసరి చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన క్వారంటైన్ సెంటర్లలో మాత్రమే వారు బస చేయాల్సి ఉంటుంది. వాటిని మార్చుకోవచ్చు కూడా. ప్రపంచంలోనే తమ ఆరోగ్య వ్యవస్థ పక్కాగా ఉంటుందని..పర్యాటకులు దీనిపై భరోసాతో ఉంచొచ్చని పేర్కొన్నారు. అయితే దీర్ఘకాలం బ్యాంకాక్ లో ఉండేందుకు వచ్చేవారు తాము నివాసం ఉండే ప్రాంతానికి చెందిన హోటల్ బుకింగ్ వివరాలు..లేదా ఏదైనా ఇళ్ళు అద్దెకు తీసుకుంటే ఆ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
దీర్ఘకాలిక వీసాల విధానం ద్వారా వారానికి గరిష్టంగా 300 మందిని, నెలకు 1200 మందిని దేశంలోకి అనుతించనున్నారు. దీని ద్వారా ఒక బిలియన్ బాత్ ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. గత కొంత కాలంగా కరోనా వైరస్ వ్యాప్తి పెద్దగా లేని దేశాలైన చైనా, తైవాన్, యూరప్ లోని పలు దేశాలకు చెందిన పర్యాటకులతో అయినా కొంత ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనలో థాయ్ ల్యాండ్ ఉంది. చైనాలోని 20 ప్రావిన్స్ లు కరోనా రహితంగా ఉన్నాయని..ఇందులో 800 మిలియన్ జనాభా ఉంటుందని..అందులో ఒక శాతం అంటే 8 మిలియన్ల మంది వచ్చినా కూడా పర్యాటక రంగానికి ఊతం దొరికినట్లు అవుతుందని థాయ్ ల్యాండ్ అధికారులు చెబుతున్నారు.