వేములవాడ
తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో వేములవాడ ఒకటి.దేశంలోని శైవ క్షేత్రాల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. వేములవాడ క్షేత్రం దక్షిణకాశీగా పేరుగాంచింది.చాళుక్యరాజులు వేములవాడను రాజధానిగా చేసుకుని 175సంవత్సరాలు పాలించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. తొలుత ఈ ప్రాంతాన్ని లెంబాలవాటిక అని తర్వాత లేములవాడ అని..అక్కడ నుంచి వేములవాడగా మారిందని చెబుతారు. వేములవాడ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి, శ్రీ మహావిష్ణు, ఆనంతపద్మనాభస్వామి,సీతారామస్వామి ఆలయాలు, 22 శివలింగాలు ఉన్నాయి. ఈ దేవాలయానికి పెద్ద చరిత్రే ఉంది. చాళుక్యుల కాలంలో రాజరాజనరేంద్రుడు నిత్యం ఈ ప్రాంతంలోని ఒక వీధిలోకి వస్తుండగా తన వెంట వచ్చే శునకం కుష్టుతో బాధపడేది. నిత్యం నీటి చెరువులో స్నానం చేసేది. ఆ స్నానంతోనే దాని వ్యాధి నయం కాగా..ఆశ్చర్యపడిన రాజు చెరువులో తవ్వించగా..మహిమాన్వితమైన లింగం బయట పడ్డట్లు..అక్కడే దాని ప్రతిష్టాపన చేసినట్లు పురాణ గాథ.
ఈ ఆలయం సమీపంలో ఇతర ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇతర ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడికి వచ్చి రాజరాజేశ్వర స్వామిని,అమ్మవారిని దర్శించుకుని రాత్రిపూట ఒక నిద్ర చేసి వెళతారు, అలా చేయటం వలన తమకు ఉన్న దోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం.శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. వందమంది అర్చకులతో మహాలింగార్చన నిర్వహిస్తారు. భక్తులు చేసే వివిధ పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు.పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ ప్రముఖ దేవాలయం జిల్లాల పునర్విభజనతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి వచ్చింది.
దర్శనవేళలు: ఉదయం 4.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకూ)
హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.