కరోనా దెబ్బకు అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ కూడా విలవిలలాడుతున్నాయి. దుబాయ్ కి చెందిన ప్రముఖ ప్రీమియం ఎయిర్ లైన్స్ అయిన ఎమిరేట్స్ ఏకంగా తొలి దశలో 180 మంది పైలట్లను తొలగించింది. రాబోయే రోజుల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని సమాచారం. విమాన సర్వీసులు ఎక్కడికి అక్కడే ఆగిపోవటం..ప్రారంభం అయిన సర్వీసుల్లో ప్రయాణికుల సంఖ్య కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ప్రతి సంస్థ ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి. అందులో భాగంగా పెద్ద ఎత్తున వివిధ విభాగాల్లో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. ఒక్క ఎమిరేట్స్ మాత్రమే కాకుండా ఎతిహాద్, ఖతార్ ఎయిర్ వేస్ లు కూడా ఇధే బాటలో పయనించనున్నాయని సమాచారం.
త్వరలో ఈ సంస్థలు కూడా ఉద్యోగుల్లో కోత పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. మే 31న ఎమిరేట్స్ 180 మంది పైలట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎమిరేట్స్ తన సిబ్బందిలో ఏకంగా 30 శాతం మందిని తప్పించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఎమిరేట్స్ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఏ380 (డబుల్ డెక్కర్) విమానాలను నడుపుతున్న ఏకైక సంస్థ ఇదే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఏ380 విమానాలతో పాటు ఇతర సర్వీసుల్లో కూడా కోత పెట్టడానికి రెడీ అవుతోంది.