విమానాల్లో రండి అనుమతిస్తాం..జమ్మూకాశ్మీర్
భూతలస్వర్గం జమ్మూకాశ్మీర్ పర్యాటకులకు గేట్లు తెరిచింది. దశల వారీగా పర్యాటకులను అనుమతించనున్నట్లు ప్రకటించారు. జులై 14 నుంచే ఇది ప్రారంభం అవుతుంది. అయితే పర్యాటకులు విధిగా రిటర్న్ ఫ్లైట్ టిక్కెట్ కలిగి ఉండటంతో హోటల్ బుకింగ్ కలిగి ఉండాలి. విమానాల్లో దిగిన ప్రయాణికులకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫలితం నెగిటివ్ అని వచ్చే వరకూ పర్యాటకులు హోటల్ గది దాటి బయటకు రావటానికి వీల్లేదు. అంతే కాదు హోటల్ నిర్వాహకులతో మాట్లాడుకుని స్థానికంగా ఎక్కడెక్కడ పర్యాటించాలనుకుంటున్నారో అక్కడ రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
జమ్మూకాశ్మీర్ అధికారులు తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ వివరాలు పేర్కొన్నారు. పర్యాటకుల అనుసరించాల్సిన మార్గదర్శకాలను జమ్మూ అండ్ కాశ్మీర్ పర్యాటక శాఖ వెబ్ సైట్ లో కూడా ఉంచారు. 65 సంవత్సరాల వయస్సు దాటిన వారు మాత్రం పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించారు.ఇప్పటివరకూ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 10156 కేసులు నమోదు కాగా, 5895 పేషంట్ల రికవరి అయ్యారు. 169 మంది కరోనా బారిన పడి చనిపోయారు.