హైద‌రాబాద్-లండ‌న్ ఎయిర్ ఇండియా స‌ర్వీసులు ప్రారంభం

Update: 2021-09-11 06:04 GMT

తెలుగు రాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌. హైద‌రాబాద్ నుంచే ఇప్పుడు ప్ర‌యాణికులు నేరుగా లండన్ వెళ్ళొచ్చు. ఎయిర్ ఇండియా ఈ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చింది. వారంలో రెండు రోజులు ఈ స‌ర్వీసులు న‌డుస్తాయి. హైదరాబాద్ నుంచి యూకేలోని హీత్రో విమానాశ్రయానికి శుక్ర, సోమవారాల్లో ఈ విమాన సేవలు ఉంటాయి. ఈ తొలి విమానం శుక్రవారం ఉదయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్లింది. ఎయిరిండియా విమానం ఏఐ-147 శుక్రవారం ఉదయం 5.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన తర్వాత కేవలం తొమ్మిది గంటల్లో లండన్‌లో ఉండొచ్చ‌ని జీఎంఆర్ విమానాశ్ర‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మన దగ్గర ఉదయం 5.30 గంటలకు వెళ్తే.. లండన్‌కు ఉదయం 11.30 గంటలకు(బ్రిటన్ కాలమానం ప్రకారం) చేరుకోవచ్చు. అలాగే సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు శంషాబాద్ నుంచి బయల్దేరే ఎయిర్ ఇండియా విమానం 147.. హీత్రో విమానాశ్రయానికి ఉదయం 7.30 గంటలకు(బ్రిటన్ కాలమానం ప్రకారం) చేరుకుంటుంది.

అదే రోజు రిటర్న్ విమానం ఏఐ-148 లండన్ నుంచి ఉదయం 9.45 గంటలకు(బ్రిటన్ కాలమానం ప్రకారం) బయల్దేరుతుంది. హైదరాబాద్‌కు రాత్రి 11.35 గంటలకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పానిక్కర్ మాట్లాడుతూ.. "భారతీయులకు యూరప్ అత్యంత ఇష్టమైన గమ్యస్థానం. లండన్‌కు నాన్‌స్టాప్ ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ అనేది యూరోప్‌కు ఎలాంటి బ్రేకుల్లేని ఎయిర్ కనెక్టివిటీని కల్పిస్తుంది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ కొత్త రూట్ లండన్‌లోని విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, రాబోయే సంవత్సరాల్లో వ్యాపారాలు, మైస్ ప్రయాణికులకు అవకాశాలను విస్తరించడానికి సహాయపడుతుంద‌న్నారు.

Tags:    

Similar News