విమానయాన రంగంలో 'ఎయిర్ ఇండియా' కొత్త రికార్డు నెలకొల్పనుంది. మహిళా పైలట్లు కొత్త కాకపోయినా దీనికి మాత్రం చాలా ప్రత్యేక ఉంది. ఈ విమానంలో కీలక సిబ్బంది అంతా మహిళలే. అంతే కాదు...అత్యంత ప్రతికూల వాతావరణం ఉండే మార్గంలో ..ఏకంగా మహిళలే 17 గంటల పాటు ఆ విమానాన్ని నడపనున్నారు. అది శాన్ ప్రాన్సిస్కోలో బయలుదేరి ...దేశ ఐటి రాజధాని బెంగుళూరుకు చేరుకోనుంది. దేశంలోనే కాదు..ప్రపంచంలోని ఓ విమానయాన సంస్థ అత్యంత సుదూర దూరం నడుపుతున్న వాణిజ్య విమానం ఇదేనని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. 'ఎయిర్ ఇండియా మహిళా శక్తి ప్రపంచ వ్యాప్తంగా మరింత ఎత్తుకు చేరుకుంది' అని వ్యాఖ్యానించారు.
ఈ సుదూర విమాన ప్రయాణంలో కాక్ పిట్ లో ఉండేవారంతా మహిళలేనని తెలిపారు. కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పాపగారి తన్మయ, కెప్టెన్ ఆకాంక్ష సోనావర్, కెప్టెన్ శివానీ మనహ్యాస్ విమానాన్ని ఆపరేట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బోయింగ్ 777-200 ఎల్‌ఆర్ విమానంలో ఈ ప్రయాణం చేయబోతున్నారు. ఏఐ 176 విమానంలో ప్రధాన పైలట్, కెప్టెన్ జోయా అగర్వాల్ మాట్లాడుతూ.. 'సుమారు 16 వేల కిలోమీటర్ల దూరం పూర్తిగా మహిళా సిబ్బందితోనే ఈ సుదీర్ఘ ప్రయాణం కొనసాగబోతుంది. మేం ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర విమానయానం చేయనున్నాం.. అయితే ఇది ఇది సౌర వికిరణాలు, అల్లకల్లోలం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉండనుంది. ఉత్తర ధృవం మీదుగా విమానాన్ని నడపడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం.
కానీ మేం దీన్ని పూర్తి చేయాలని బలంగా నిర్ణయించకున్నాం. చరిత్రని తిరగరాస్తమనే నమ్మకం ఉంది' అన్నారు. ఈ విమానం శనివారం రాత్రి 8:30 గంటలకు (స్థానిక సమయం) శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరి 2021 జనవరి 11 న తెల్లవారుజామున 3.45 గంటలకు (స్థానిక సమయం) బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఆర్కిటిక్ మీదుగా ప్రయాణించడం వలన రెండు సాంకేతిక కేంద్రాలైన బెంగళూరు, శాన్ ఫ్రాన్సిస్కోల మధ్య దూరం తగ్గుతుంది. ఈ రెండు ప్రాంతాలు సుమారు 13,993 కిలోమీటర్ల దూరంలో.. ప్రపంచం వ్యతిరేక చివరలలో 13.5 గంటల టైమ్ జోన్ లాగ్‌తో ఉంటాయి. ఫ్లైట్ సేఫ్టీ ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కెప్టెన్ నివేదా భాసిన్ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.