రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయితే చాలు...నో క్వారంటైన్
పర్యాటకులకు శుభవార్త. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారు ఇక ఎంచక్కా బ్యాంకాక్ సందర్శించొచ్చు. ఇప్పటివరకూ ఉన్న పధ్నాలుగు రోజుల క్యారంటైన్ నిబంధన కూడా తొలగించారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. కరోనా కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు థాయ్ లాండ్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. థాయ్ ల్యాండ్ కు ప్రధాన ఆదాయ వనరుల్లో పర్యాటక రంగం ఒకటి అన్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు ఇది అత్యంత దారుణంగా పడిపోయింది. టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్ లాండ్ అంతర్జాతీయ ప్రయాణికులను అక్టోబర్ 1 నుంచి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పూర్తి అయిన పర్యాటకులను బ్యాంకాంక్ తోపాటు మరో నాలుగు ప్రావిన్స్ ల్లోకి అనుమతిస్తారు. అంతకు ముందు థాయ్ లాండ్ అంతర్జాతీయ పర్యాటకులకు శాండ్ బ్యాక్స్ కాన్సెప్ట్ ను అమలు చేసింది. ముఖ్యంగా పుకెట్ వంటి ప్రాంతాల్లో ఇది అమలుచేశారు.
ఈ పద్దతి కింద దేశంలోకి ప్రవేశించిన తర్వాత కోవిడ్ టెస్ట్ లు చేయించుకుని వారం రోజులు ఒకే చోట ఉండాలి. వచ్చిన ఫలితాలను పరిశీలించిన తర్వాత వారిని ఎక్కడైనా తిరిగేందుకు అనుమతిస్తారు. శాండ్ బాక్స్ స్కీమ్ కింద 29 వేల మంది విదేశీ ప్రయాణికులు పుకెట్ ను సందర్శించగా..50 మిలియన్ అమెరికా డాలర్ల మేర ఆదాయం వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. విశేషం ఏమిటంటే థాయ్ లాండ్ లో ప్రస్తుతం రోజుకు 14 వేల కేసులు నమోదు అవుతున్నా ప్రభుత్వం పర్యాటకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తొలి, రెండు దశల్లో థాయ్ ల్యాండ్ కరోనాను బాగానే నియంత్రించగలిగింది. కానీ డెల్టా వేరియంట్ తో మాత్రం అక్కడ పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా మారింది. ఈ తరుణంలో అంతర్జాతీయ పర్యాటకులకు గేట్లు బార్లా తెరవాలని నిర్ణయించటం విశేషం.