విజయవాడ విమానాశ్రయం కొత్త హంగులు సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత పెద్ద రన్ వే కల విమానాశ్రయంగా ఇది అవతరించింది. కొత్తగా ఏర్పాటు చేసిన హై ప్రీక్వెన్సీ (డీవీఓఆర్) సౌకర్యంతోపాటు విస్తరించిన రన్ వే కూడా గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. విస్తరించిన రన్ వే ఎయిర్ ఇండియాకు చెందిన తొలి విమానం ల్యాండ్ అయినట్లు ఏఏఐ తన సోషల్ మీడియా అధికారిక పేజీలో పోస్ట్ చేసింది.
ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. కొత్త రన్ వే పొడవు మొత్తం 3360 మీటర్లు ఉంటుందని తెలిపారు. దీంతో ఇప్పుడు విజయవాడ విమానాశ్రయంలో పెద్ద బాడీతో ఉండే విమానాలు (కోడ్ ఈ టైప్) కూడా ల్యాండ్ కావటానికి అవకాశం ఉంటుంది. నూతన రన్ వేతో విజయవాడ నుంచి త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.