సాహసాలు చేసేవారికి..కొత్తదనం కోరుకునే వారికి పర్యాటక దేశాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అవకాశాలు కల్పిస్తుంటాయి. కొన్ని సహజంగా ఉండే అవకాశాలు అయితే..మరికొన్ని పర్యాటకుల కోసం కొత్తగా ఏర్పాటు చేసేవి. ఇప్పుడు దుబాయ్ అదే పని చేసింది. ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ ను దుబాయ్ ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. ఇది 60.02 మీటర్లు ( 196 అడుగుల) లోతు ఉంటుంది. దీని పేరే డీప్ డైవ్ దుబాయ్. ఈ పూల్ ను 1.4 కోట్ల లీటర్ల నీటితో నింపుతారు. ఇది ఆరు ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ కు సమానం.
మునిగిపోయిన నగరం కాన్సెప్ట్ తో ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. డీప్ డైవ్ దుబాయ్ సిటి స్విమ్మింగ్ పూల్ కు సంబంధించిన వీడియోను దుబాయ్ రాజు హమీద్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇన్విటేషన్ మీద మాత్రమే ఇందులో అనుమతి ఇస్తున్నారు. జులై నెలాఖరు నుంచి ప్రజలకు అనుమతించే అవకాశం ఉంది. ప్రపంచం అంతా డీప్ డైవ్ దుబాయ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందని దుబాయ్ రాజు వ్యాఖ్యానించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇప్పటికే దీన్ని పరిశీలించింది. త్వరలో ఇది రికార్డుల్లోకి ఎక్కటం ఖాయంగా కన్పిస్తోంది.