ఢిల్లీ విమానాశ్ర‌యం..ప్ర‌పంచంలోనే రెండ‌వ స్థానం

Update: 2022-05-03 06:58 GMT

జీఎంఆర్ నిర్వ‌హ‌ణ‌లోని ఢిల్లీ అంత‌ర‌ర్జాతీయ విమానాశ్ర‌యం అరుదైన రికార్డు న‌మోదు చేసింది. మార్చి నెల‌కు సంబంధించి ఈ విమానాశ్ర‌యం ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయంగా నిలిచింది. కోవిడ్ ప్రభావాన్ని అధిగమించిన ఢిల్లీ విమానాశ్రయం ముందుకు దూసుకెళుతోంది. మార్చి 2022లో ప్రముఖ గ్లోబల్ ట్రావెల్ డేటా ప్రొవైడర్ అయిన అఫీషియల్ ఎయిర్‌లైన్ గైడ్ (OAG) ప్రకారం, సీట్ల సామర్థ్యం (బుక్ అయిన విమాన సీట్లు) , దేశీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్యపరంగా ప్రపంచంలోనే రెండవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా అవతరించిందని జీఎంఆర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ట్రావెల్ డేటా, ఇన్ సైట్స్ అందించే ప్రపంచంలోని ప్రముఖ సంస్థ OAG, సీట్ల సామర్థ్యం (బుక్ అయిన విమాన సీట్లు), ఆ విమానాశ్రయం నుండి నిర్వహించే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల ఆధారంగా ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే 10 విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంది. యూకెలో ప్రధాన కార్యాలయం కలిగిన OAG, 1929 నుండి విమాన ప్రయాణ పర్యావరణ వ్యవస్థకు ఊతాన్నిస్తోంది. OAG అమెరికా, సింగపూర్, జపాన్, లిథువేనియా, చైనాలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన జాబితా ప్రకారం, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (3,554,527 సీట్లు)ను పక్కకు నెట్టి, ఢిల్లీ విమానాశ్రయం (3,611,181 సీట్లు) 2వ స్థానంలో నిలిచింది. గ‌త నెల జాబితాలో, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2వ స్థానంలో ఉంది.

అట్లాంటా హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ATL) తన అగ్ర స్థానాన్ని (4,422,436 సీట్లు) నిలుపుకుంది. మార్చిలో విడుదల చేసిన ఫిబ్రవరి 2022 ర్యాంకింగ్‌లలో, ఢిల్లీ విమానాశ్రయం అట్లాంటా హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్ విమానాశ్రయం తర్వాత 3వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా నాల్గవ రద్దీగా ఉండే విమానాశ్రయమై చైనాలోని గ్వాంగ్‌జౌ విమానాశ్రయాన్ని అధిగమించింది. ఏప్రిల్ 2019 స్థానంతో పోల్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయం చాలా ముందుకు వెళ్లింది. కోవిడ్‌కు ముందు ఢిల్లీ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో 23వ స్థానంలో ఉంది. మొత్తం దేశీయ, అంతర్జాతీయ సీట్ల సామర్థ్యం (బుక్ అయిన సీట్లు), ఆయా విమానాశ్రయాల నుండి విమానాల ఫ్రీక్వెన్సీని ఉపయోగించి టాప్ 10 విమానాశ్రయాలను గుర్తించారు. దేశీయ ట్రాఫిక్‌ కారణంగా ఢిల్లీ విమానాశ్రయం ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా మారింది. మార్చి 2022 చివరిలో ప్రారంభమైన అంతర్జాతీయ ప్రయాణాలు ఇంకా కోలుకోలేదు, ప్రస్తుతం ఇది కోవిడ్ పూర్వ స్థాయిలో 70శాతం వద్ద ఉందని తెలిపారు. 

Tags:    

Similar News