దేశీయ విమాన పరిశ్రమ ఇప్పుడిప్పుడే గాడినపడుతోంది. కరోనా రెండవ దశ తగ్గుముఖం పట్టడంతో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మే నెలతో పోలిస్తే జూన్ లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జులై నెలలో ఇది మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. తాజాగా వెల్లడైన ఢిల్లీ విమానాశ్రయ గణాంకాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని కరోనా రెండవ దశ వణికించింది. ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఢిల్లీ విమానాశ్రయానికి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
మే నెల మధ్య నుంచి జూన్ నెలాఖరు వరకూ చూస్తే ఈ పెరుగుదల స్పష్టంగా కన్పిస్తోంది. మే మధ్యలో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే వారి సంఖ్య రోజుకు 18 వేలు ఉండేది. జూన్ నెలాఖరు నాటికి ఇది రోజుకు 62 వేలకుపైనే పెరిగింది. మే, జూన్ నెలల్లో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల్లో అత్యధికులు ముంబయ్, పట్నా, బెంగళూరు, పూణే, హైదరాబాద్, లెహ్, చెన్నయ్, అహ్మదాబాద్, కోల్ కతా నగరాల నుంచే ఉన్నారు.విదేశీ ప్రయాణికుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. పరిస్థతి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.