యూఏఈకి చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ మూడు ప్రధాన విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంది. వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ 2020లో భాగంగా ఎమిరేట్స్ కు ప్రయాణికులు పట్టం కట్టారు. ప్రపంచంలోనే లీడింగ్ ఎకానమీ క్లాస్, ఎయిర్ లైన్ రివార్డ్స్ ప్రోగ్రామ్, వరల్డ్స్ లీడింగ్ బిజినెస్ క్లాస్ ఎయిర్ లైన్ లాంజ్ విభాగంలో ఈ అవార్డులు దక్కించుకుంది. ప్రయాణికులకు తాము అందించిన మెరుగైన, సురక్షిత ప్రయాణ అనుభూతులకు గుర్తింపుగానే ఈ అవార్డులు దక్కాయని భావిస్తున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది.
అంతర్జాతీయంగా కరోనా ఎన్నో సవాళ్ళు విసిరినా తాము ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దుబాయ్ అంతర్జాతీయ విమాశ్రయంలోని టెర్మినల్ 3లో ఉన్న బిజినెస్ క్లాస్ లాంజ్ లో కోవిడ్ కు ముందు ఉన్న తరహాలో అన్ని రకాలు సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది. కరోనా లాక్ డౌన్ల తర్వాత ఎమిరేట్స్ పలు దేశాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. దుబాయ్ కొన్ని నిబంధనలతో పర్యాటకులను అనుమతించటం కూడా ఈ ఎయిర్ లైన్స్ కు ఒకింత ఊరటనిచ్చే పరిణామమే అని చెప్పొచ్చు.