ఫ్లై మీ టూ ద సూపర్ మూన్
సూపర్ మూన్ దగ్గరకు ఎగిరిపోండిలా
మే26న ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. ఆ అద్భుతాన్ని వీక్షించేందుకు క్వాంటాస్ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల కోసం ఓ అద్బుత అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే 'ఫ్లై మీ టూ ద సూపర్ మూన్' పేరుతో రెండున్నర గంటల పాటు క్వాంటాస్ కు చెందిన బి787 డ్రీమ్ లైనర్ లో నుంచి ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం తీసుకొచ్చింది. పౌర్ణమి రోజు నిండు చంద్రుడిని చూస్తే ఎంతో హాయిగా అన్పిస్తుంది. అలాంటిది నలభై వేల అడుగుల ఎత్తులో అలా విమానంలో విహరిస్తూ సూపర్ మూన్ ను చూస్ అవకాశం వస్తే?. అవును ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. మరో విశేషం ఏమిటంటే సూపర్ మూన్ దగ్గరకు వెళ్లే ఈ విమానం టిక్కెట్లు కేవలం రెండున్నర నిమిషాల్లో అమ్ముడుఅయిపోయాయి. అంటే దీనికి ఎంత క్రేజ్ ఉందో చూస్కోండి. ఈ అద్భుతం మే 26న ఆవిష్కృతం కానుంది. 40 వేల అడుగుల ఎత్తులో నుంచి సూపర్ మూన్ రోజు ప్రకృతిని చూసి పరవశించే అవకాశం కల్పిస్తోంది క్వాంటాస్. పూర్తి చంద్రగ్రహణం వీక్షించే అవకాశం ఈ విమాన ప్రయాణికులకు దక్కనుంది.
క్వాంటాస్ విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారందరికీ ఓ బహుమతితో కూడిన బ్యాగ్ తోపాటు ఇది గుర్తుండిపోయేలా ఓ సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్లు క్వాంటాస్ వెల్లడించింది. బి787 డ్రీమ్ లైనర్ విమానంలో ఈ అద్భుత ప్రయాణ అనుభూతిని కల్పించబోతున్నారు. సిడ్నిలో బయలుదేరే విమానం రెండున్నర గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టనుంది. టేకాఫ్ తర్వాత సిడ్నీ హార్బర్ నైట్ లైట్స్ వీక్షించిన తర్వాత పసిఫిక్ మహాసముద్రం నుంచి తూర్పు వైపునకు ఈ విమానం వెళుతుంది. ఏ ప్రయాణ విమానంలో ఉండని రీతిలో ఈ బి787 డ్రీమ్ లైనర్ లో అతి పెద్ద విండోస్ ఉంటాయని క్వాంటాస్ వెల్లడించింది. ఈ పర్యటన చేయాలనుకున్న వారు బిజినెస్ క్లాస్ లో వెళ్లాలంటే లక్షా పన్నెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం ఎకానమీ సీటు ధరను 67425 రూపాయలుగా నిర్ణయించారు. ఎకానమీ సీటు ధర 37,425 రూపాయలు అని తెలిపారు.