మళ్లీ అంతర్జాతీయ ప్రయాణాలకు లైన్ క్లియర్ అవుతోంది. ఒక్కో దేశం భారత ప్రయాణికులకు అనుమతి మంజూరు చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే మాల్దీవులు జులై 15 నుంచి భారత పర్యాటకులకు అనుమతి ఇచ్చింది. అయితే ఆర్ టీ పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ మాత్రం తప్పనిసరి అంటున్నాయి. ఇప్పుడు జర్మనీ కూడా భారత ప్రయాణికులపై ఆంక్షలను ఎత్తేసింది. కోవిడ్-19 కేసుల్లో తీవ్రత తగ్గిన నేపథ్యంలో జర్మనీ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసింది. భారత్ సహా ఐదు దేశాల ప్రయాణికులకు అనుమతినిస్తూ నిబంధనలు సడలించింది. ఈ మేరకు.. ''డెల్టా వేరియంట్‌తో ప్రభావితమైన ఐదు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను బుధవారం నుంచి ఎత్తివేస్తున్నాం'' అని భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్ జె. లిండ్నర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా సడలింపుల ప్రకారం ఇండియా, యూకే, పోర్చుగల్ దేశాల ప్రయాణికులపై నిషేధం ఎత్తివేశారు. ఇక జర్మనీ నివాసులు, పౌరులేగాక ఇతర దేశాల ప్రయాణికులు కూడా దేశంలో ప్రవేశించవచ్చు. అయితే, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, క్వారంటైన్‌లో ఉండటం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. కరోనా నేపథ్యంలో యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) భారత్ సహా 14 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. జులై 21 వరకు ఈ నిబంధనుల అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.