హైద‌రాబాద్-కొలంబో డైర‌క్ట్ విమాన స‌ర్వీసులు ప్రారంభం

Update: 2021-09-03 08:23 GMT

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగిపోయిన అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు ఒక్కొక్క‌టిగా ప్రారంభం అవుతున్నాయి. పందొమ్మిది నెల‌ల విరామం త‌ర్వాత జీఎంఆర్ హైద‌రాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి శుక్ర‌వారం నాడు శ్రీలంకలోని కొలంబోకు నేరుగా విమాన సర్వీసును పున:ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9.55 గంటలకు హైదరాబాద్ నుండి కొలంబోకు 120 ప్రయాణీకులతో విమానం బయలుదేరింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీలంక ఎయిర్ లైన్స్ ఉన్నతాధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. హైదరాబాద్ - కొలంబో మధ్య వారానికి రెండుసార్లు - సోమవారం , శుక్రవారం - విమానాలు నడుస్తాయని జీఎంఆర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, " అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన శ్రీలంకకు వెళ్లడానికి ప్రయాణికులంతా ఇష్టపడతార‌న్నారు.. హైదరాబాద్-కొలంబోలను కలిపే ఈ నాన్‌స్టాప్ సర్వీసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులను శ్రీలంకలోని అనేక అందమైన గమ్యస్థానాలకు చేరవేస్తుంది. శ్రీలంక ఎయిర్‌లైన్స్ తన సర్వీసులను తిరిగి హైదరాబాద్‌కు విస్తరించినందుకు మేము సంతోషిస్తున్నాము.

కొత్త విమానానికి దక్షిణ భారతదేశ ప్రజల నుండి మళ్లీ ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాము. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త అంతర్జాతీయ మార్గాలను అన్వేషించడం కొనసాగిస్తోంది. త్వరలో మరిన్ని నూతన గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభించడానికి మేం ఎదురుచూస్తున్నాము.'' అన్నారు. శ్రీలంక ఎయిర్ లైన్స్ రీజనల్ మేనేజర్, (ఇండియా, బంగ్లాదేశ్ మరియు నేపాల్)వి. రవీంద్రన్ మాట్లాడుతూ '' శ్రీలంక ఎయిర్ లైన్స్ కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు ప్రధానమైన మార్కెట్లు. త్వరలో ప్రయాణికుల డిమాంగ్ పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మేము తెలంగాణ నుంచి శ్రీ లంక ఎయిర్ లైన్స్ సర్వీసుల ఫ్రీక్వెన్సీ మరియు కెపాసిటీ పెంచాలని యోచిస్తున్నాము'' అన్నారు. పచ్చని తోటలు, జలపాతాలు, ఉష్ణమండల బీచ్‌లు, వన్యప్రాణులు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు కలిగి యాత్రికులకు స్వర్గంలాంటి శ్రీలంక, భారతీయులకు ఇష్టమైన దేశాలలో ఒకటి. హనీమూన్ జంటలు, సాహస క్రీడా ప్రేమికులు, కుటుంబ సభ్యులందరికీ ఇది ఇష్టమైన గమ్యస్థానం. హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటిది. ఇది విజయవాడ, విశాఖపట్నం, నాగపూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్ మరియు తిరుపతి లాంటి సమీప నగరాల నుండి వచ్చిన ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News