కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతి ఏటా గోవాలో నిర్వహించే సన్ బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్ దుమ్మురేపుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆసక్తిచూపని యువత ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో యువత జోష్..హుషారు ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే నిర్వాహకులు మాత్రం ఈసారి సన్ బర్న్ ఫెస్టివల్ కు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయిన వారినే అనుమతిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి తేదీలు కూడా ప్రకటించారు. డిసెంబర్ 28-30 లో ఈ ఫెస్టివల్ కొనసాగనుంది. కరోనా కారణంగా గత ఏడాది డిజిటల్ గా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 60 మంది కళాకారులు పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే దీనిపై గోవా ప్రభుత్వం మాత్రం ఇంత వరకూ సన్ బర్న్ ఫెస్టివల్ నిర్వహణకు ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదని ప్రకటించింది. దీంతో ఈ కార్యక్రమంపై అనిశ్చితి నెలకొంది. నిర్వాహకులు తేదీలు ప్రకటించిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందే నిర్వాహకులు ఈ తేదీలను ఎలా ప్రమోట్ చేస్తున్నారో తెలియటం లేదంటూ గోవా పరర్యాటక శాఖ మంత్రి మనోహర్ అగ్నోకర్ వ్యాఖ్యానించారు.