ఎయిర్ ఇండియా విమానాలు హాంకాంగ్ నిషేధం ఎదుర్కోవటం ఇది మూడవసారి. ఇప్పుడు ఎయిర్ ఇండియాతో పాటు విస్తారా కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నిషేధం అక్టోబర్ 30 వరకూ అమల్లో ఉండనుంది. దీనికి కారణం ఏమిటంటే ఎయిర్ ఇండియా విమానాల్లో వెళ్లిన ప్రయాణికులు కొంత మందికి కరోనా పాజిటివ్ అని తేలటమే. అయితే విస్తారా ఈ తరహా నిషేధం ఎదుర్కోవటం ఇదే మొదటిసారి. ఈ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించిన వారిలో కొంత మందికి కరోనా పాజిటివ్ తేలటంతో హాంకాంగ్ ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం కరోనా నెగిటివ్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించాలనే నిబంధన ఉంది.
అయితే కొంత మందికి మాత్రం హాంకాంగ్ లో చేసిన టెస్ట్ ల్లో పాజిటివ్ తేలటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 17 నించి 30 వరకూ ఈ రెండు ఎయిర్ లైన్స్ విమానాలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. అయితే ప్రయాణికుల టెస్ట్ రిపోర్టుల్లో ఏమైనా తేడాలు ఉంటే తెలియదు కానీ..తాము కేవలం నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్న వారిని మాత్రమే విమానాల్లోకి ఎక్కించుకుంటున్నామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులు హాంకాంగ్ లో ల్యాండ్ కాగానే వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే 72 గంటల వ్యవధిలోనే పరీక్షల్లో తేడాలు వస్తున్నాయని చెబుతున్నారు.