రష్యా దేశీయ విమాన సర్వీసులతోపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జనవరి 27 నుంచి భారత్ -రష్యాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. భారత్ తోపాటు ఫిన్లాండ్, వియత్నం, ఖతార్ ల మధ్య పరస్పర అవగాహనతో విమాన సర్వీసులకు ఆమోదం తెలపాలని రష్యా నిర్ణయించింది. అయితే మాస్కో-ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు వారానికి రెండు సర్వీసులు ఉండే అవకాశం ఉందని సమాచారం.
రష్యా ఎమర్జన్సీ రెస్సాన్స్ సెంటర్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఉప ప్రధాని తాతినా గోలికోవా అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించనున్నట్లు ప్రకటించారు. రష్యాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఎంపిక చేసిన దేశాల మధ్య సర్వీసుల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నారు. ఆయా దేశాలతో కుదిరే ఒప్పందాల ప్రకారం విమాన సర్వీసుల సంఖ్యను నిర్ణయిస్తారు. దీంతో పాటు ట్రాఫిక్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.