ఈ సారి ఒమిక్రాన్ దెబ్బపడింది. షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వాయిదా పడింది. వాస్తవానికి కేంద్రం డిసెంబర్ 15 నుంచి షెడ్యూల్ అంతర్జాతీయ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. దీంతో 20 నెలల తర్వాత కోవిడ్ కు ముందు తరహాలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని భావించారు. కానీ అకస్మాత్తుగా ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడటంతో ఒక్కసారిగా పలు దేశాలు సరిహద్దులను మూసివేయటం ప్రారంభించాయి. ముఖ్యంగా ఈ వేరియంట్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికాతోపాటు మరికొన్ని దేశాల విమానాలపై నిషేధం విదించారు.
ఈ పరిణామాలపై డైరక్లర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వివిధ భాగస్వాముల నుంచి అభిప్రాయాలు తీసుకుని షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ నిర్ణయం వాయిదా వేసింది. తర్వాత ఈ తేదీని నోటిఫై చేస్తామని బుధవారం నాడు సర్కులర్ జారీ చేసింది. దీంతో ఈ విమాన సర్వీసుల కోసం ఆశగా ఎదురుచూసిన ప్రయాణికులు..ఎయిర్ లైన్స్ కు మరోసారి నిరాశే మిగిలింది. అయితే ప్రస్తుతం సాగుతున్న తరహాలోనే ఎయిర్ బబుల్ ఒప్పందాల కింద విమాన సర్వీసులు మాత్రం కొనసాగనున్నాయి. వీటితోపాటు లోరిస్క్ దేశాలకు కూడా విమాన సర్వీసులు పరిమితంగా కొనసాగనున్నాయి.