ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ ఎక్కడో తెలుసా?
మబ్బులకు దగ్గరగా కూర్చుని హోటల్ రెస్టారెంట్ లో విందు ఆరగిస్తే...ఆహా..అనుభూతే వేరు. అంతే కాదు..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్ లో బస చేయాలనుకుంటే.. ..ఎస్..ఇప్పుడు ఆ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన భవనమే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న హోటల్ కూడా ఇదే. అదే జె హోటల్. ఇప్పటివరకూ దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫానే ప్రపంచంలో నెంబర్ వన్ ఎత్తైన భవనం అన్న సంగతి తెలిసిందే. షాంఘై టవర్ లో ఉన్న ఈ హోటల్ ను తాజాగా ప్రారంభించారు. వాస్తవానికి ఎప్పుడో ఇది అందుబాటులోకి రావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలశ్యం అయింది. ఈ షాంఘై టవర్ 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ స్కై స్క్రాపర్ లోని 86 నుంచి 98 ఫ్లోర్లలో హోటల్ గదులు ఉంటాయి. హోటల్ లాబీ 101 అంతస్థులో ఉంటుంది.
హోటల్ కు చెందిన రెస్టారెంట్ మాత్రం 120వ అంతస్థులో ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ మాత్రం 84 ఫ్లోర్ లో ఉంది. ప్రపంచంలోనే త్యంత విలాసవంతమైన రెస్టారెంట్ గా ఇది నిలుస్తుంది. ఈ హోటల్ లోని లిఫ్ట్ లు సెకండ్ కు 18 మీటర్ల వేగంగా పరుగులు పెడతాయి. ఈ హోటల్ లో మొత్తం ఏడు రెస్టారెంట్లు, బార్లు, స్పా తో పాటు అన్ని రకాల వసతులు ఉంటాయి. ఓపెనింగ్ రోజు కస్టమర్ల తాకిడితో వెబ్ పేజ్ కూడా ఓవర్ లోడ్ అయిందని సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరక్టర్ రెనీ వూ తెలిపారు. హోటల్ ఆతిధ్యం చవిచూసేందుకు చాలా మంది ఆసక్తితో ఉన్నారని తెలిపారు. అతిథులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె వెల్లడించారు. ఒక్క రోజు ఈ హోటల్ లో బసకు 10,352 అమెరికా డాలర్లుగా ఉంది.