మాల్దీవులు. కరోనా టైమ్ లోనూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రాంతం. కరోనా తర్వాత అంతర్జాతీయ పర్యాటకులను అనుమతించిన తొలి ప్రాంతం కూడా ఇదే కావటం విశేషం. దీంతో పలు దేశాల నుంచి పర్యాటకులు అందరూ మాల్దీవుల బాట పట్టారు. ముఖ్యంగా సంపన్నులు, బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ చలో మాల్దీవులు అంటూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా పరీక్షలు చేయించుకోవాలనే నిబంధనలు లేకపోవటం, క్వారంటైన్ ఆంక్షలు ఏమీ లేకపోవటంతో పర్యాటక ప్రియులకు మాల్దీవులు ఇప్పుడు ఓ కీలక కేంద్రంగా మారిపోయింది. ఈ కరోనా టైమ్ లో పెద్దగా ఆంక్షలు లేకుండా వెళ్ళదగ్గ ప్రాంతం కూడా ఇదే కావటంతో అందరూ మాల్దీవులపై ఆసక్తికనపరుస్తున్నారు. పైగా మాల్దీవుల్లో పర్యటించేందుకు కూడా ఇది అనువైన సమయం కావటం మరో సానుకూల అంశంగా మారింది.
ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు మాల్దీవులు ఎంతో అనువైన ప్రాంతం. నీలి రంగులో ఉండే సముద్రపు నీరు..తెల్లటి ఇసుక తిన్నెలు, స్వచ్చమైన గాలి ఇంకేం కావాలి ఈ టైమ్ లో పర్యాటకులు ఎంజాయ్ చేయటానికి. వాటర్ స్పోర్ట్స్ అయిన స్విమ్మింగ్, స్కూబా డైవింగ్, స్కోర్కెలింగ్, వాటర్ స్కీయింగ్ వంటి గేమ్ లకు ఇది అనువైన ప్రాంతం. ఒక్క ప్రకృతిని ఆస్వాదించటమే కాదు..మాల్దీవుల్లో సందర్శించదగ్గ ప్రాంతాలు కూడా ఎన్నో. అందుకే ఈ కరోనా టైమ్ లో చాలా మంది మాల్దీవుల బాట పట్టారు. లాక్ డౌన్ సమయంతోపాటు కరోనా ఆంక్షల సమయంలో ఇళ్లలో ఉండి ఉండీ విసుగెత్తిన చాలా మంది పర్యటనల బాట పడుతున్నారు. అలాంటి వారందరికీ మాల్దీవులు బెస్ట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే పర్యాటకుల సంఖ్య తక్కువే ఉన్నంతలో ఎక్కువ మంది వెళుతున్న ప్రాంతం ఇదే.