ద్వీప దేశం మాల్దీవులు భారత పర్యాటకులకు శుభ వార్త చెప్పింది. జులై 15 నుంచి పర్యాటకులను అనుమతించనుంది. ఆర్ పిసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఆన్ అరైవల్ వీసా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు ట్వి్ట్టర్ ద్వారా ప్రకటించింది. త్వరలోనే మరిన్ని అంశాలను వెల్లడిస్తామని పేర్కొంది. భారత్ తోపాటు దక్షిణ ఆసియా దేశాలకు కూడా ఈ అవకాశం కల్పిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల పర్యాటకులు మాల్దీవుల సందర్శన అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారనే విషయం తెలిసిందే. కరోనా తొలి దశ సమయంలో బాలీవుడ్ తో పలు సినిమా పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు మాల్దీవుల్లో మకాం వేసి ఎంజాయ్ చేస్తూ కోవిడ్ నుంచి రక్షణ పొందే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
అయితే కరోనా రెండవ దశ తీవ్రంగా ఉండటంతో మాల్దీవులు భారత పర్యాటకులతోపాటు పలు దేశాల పర్యాటకులకు ఎర్ర జెండా చూపించింది. ప్రస్తుతం భారత్ తోపాటు పలు దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ పర్యాటక ప్రారంభించాలని నిర్ణయించారు. పర్యాటకులకు మార్గం సుగమం చేసినా..కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మాల్దీవులను సందర్శించే వారిలో రష్యన్ల తర్వాత భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. మాల్దీవులు మళ్లీ పర్యాటకులకు స్వాగతం పలుకుతుండటంతో సెలబ్రిటీలతోపాటు టూరిస్ట్ లు మళ్ళీ క్యూ కట్టే అవకాశం ఉంది.