ఒమన్ వెళ్లే ప్రయాణికులు, పర్యాటకులకు శుభవార్త. ఇప్పటివరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అత్యవసర వినియోగ జాబితాలో చోటు దక్కని కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను ఆ దేశం గుర్తించింది. భారత్ లో ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారు ఎలాంటి క్వారంటైన్ అవసరం లేకుండా ఒమన్ లో పర్యటించవచ్చు. అయితే పర్యటనకు 14 రోజుల ముందు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఒమన్ లోని భారతీయ ఎంబసీ అధికారికంగా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. అయితే ప్రయాణానికి ముందు ఆర్ టీ పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ పొందటం వంటి ఇతర నిబంధనలు అందరికీ వర్తిస్తాయని తెలిపారు.
ఒమన్ ఇప్పటికే కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. భారత్ తోపాటు మొత్తం 20 దేశాల ప్రయాణికులను ఒమన్ అనుమతిస్తోంది. అయితే అందరూ విధిగా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకుని ఉండాలని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్ కు డబ్ల్యూహెచ్ వో అత్యవసర వినియోగ జాబితాలో చోటు కల్పించే అంశం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళుతోంది. తాజాగా డబ్ల్యూహెచ్ వో మరింత సమాచారం కోరింది. ఈ సమాచారం సకాలంలో చేరితే నవంబర్ 3 నాటికి అనుమతి లభించవచ్చని భావిస్తున్నారు.