మన దేశాన్ని సందర్శించండి. దేఖో అప్ నా దేశ్ పేరుతో కేంద్ర పర్యాటక శాఖ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 'రామాయణ యాత్ర' పేరుతో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) రామాయణ సర్కూట్ రైలు సర్వీసులను ప్రారంభించింది. అత్యాధునిక సౌకర్యాలతో ఏసీ డీలక్స్ టూరిస్ట్ రైలుతో ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర కింద తొలి రైలు నవంబర్ 7న ఢిల్లీలోని సఫ్టర్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అయింది. శ్రీరాముడి జీవితంతో సంబంధం ఉన్న అన్ని కీలక ప్రాంతాలను కవర్ చేసేలా ఈ యాత్ర ను ప్రారంభించారు. ఐఆర్ సీటీసీ ప్రారంభించిన 'రామాయణ యాత్ర' కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వచ్చిందని..రైలు పూర్తిగా భర్తీ అయిందని తెలిపారు. తొలి రైలు ఆదివారం నాడు బయలుదేరగా..మళ్ళీ ఇలాంటి యాత్రే డిసెంబర్ 12న ప్రారంభం కానుందని ఐఆర్ సీటీసీ వెల్లడించింది. దీనికి కూడా భారీ ఎత్తున స్పందన వస్తోందని తెలిపింది. రామయాణ యాత్ర 17 రోజుల పాటు సాగనుంది. రామాయణ యాత్ర రైలు తొలిసారిగా ఆగేది రామజన్మభూమి అయిన అయోధ్యలో. అక్కడ రామజన్మభూమి దేవాలయంతో పాటు హనుమాన్ టెంపుల్, నందిగ్రామ్ లో భారత్ మందిర్ ను సందర్శిస్తారు. తర్వాత బీహార్ లో సీత మారి దగ్గర రైలు ఆగుతుంది.
రోడ్డు మార్గంలో సీత పుట్టిన ప్రాంతం అయిన జానక్ పూర్ లోని రామ్ జానకి టెంపుల్ ను సందర్శిస్తారు. వీటితోపాటు ఈ రైలు వారణాసి, ప్రయాగ్, శ్రింగ్ వేర్పూర్, చిత్రకూట్ వంటి ప్రాంతాలను చూపిస్తారు. పర్యాటకులకు వారణాసి, చిత్రకూట్ ల్లో రాత్రి బస ఏర్పాటు చేయనున్నట్లు ఐఆర్ సీటీసీ వెల్లడించింది. తర్వాత నాసిక్ లో ఈ రైలు ఆగుతుంది. నాసిక్ తర్వాత హంపి. ఈ రైలు ప్రయాణంలో రామేశ్వరం చివరి సందర్శన ప్రాంతంగా ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం యాత్రలో సందర్శకులు 7500 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అయితే ఈ యాత్రకు ఒక్కో ప్రయాణికుడు 2ఏసీకి అయితే 82,950 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే 1,02,095 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఏసీ రైలు ప్రయాణంతోపాటు ఏసీ హోటళ్లు, భోజనాలు, ఏసీ వాహనాల్లో ఆయా ప్రాంతాల సందర్శన, ప్రయాణ బీమా ఇతర సేవలు ఉంటాయి. ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్త చర్యలు ఈ పర్యటన సమయంలో తీసుకుంటున్నట్లు ఐఆర్ సీటీసీ వెల్లడించింది.